ఏ ఇంటిలోనైనా ఆడపిల్ల పుట్టింది అంటే మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని అంటుంటారు చాలా మంది .యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత' అన్నది ప్రాచీన కాలం నుంచి ఉన్న మన ఆర్యోక్తి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడుతారన్నది దాని భావం. అయితే చెప్పుకోడానికి మాత్రం ఎంతో గొప్పగా ఉన్నా ఇలాంటి సూక్తులు నేటి ఆధునిక కాలంలో ఎందుకూ కొరగాకుండా పోవడమే బాధాకరం. ఆడపిల్లలను గౌరవించేవారు కానీ, వారిని రక్షించేవారు కానీ, వారి హక్కులను పరిరక్షించేవారు కానీ నేటి కాలంలో నానాటికీ తగ్గిపోతుండడం... ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతూ ఉండటం ఎంతో దురదృష్టకరం. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ దుస్థితి ఉండడం మరింత ఆందోళనకరం. నేటి బాలికలే రేపటి స్త్రీ మూర్తులు, స్త్రీ లేనిదే సమాజానికి అతీగతీ లేదు.
స్త్రీ లేని సమాజాన్ని అస్సలు ఊహించలేం ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు. స్త్రీలు అనే వారు.. అమ్మతనానికి మరో పేరు. ఈ విషయాలు అందరికీ బాగా తెలిసినవే.. తెలియందల్లా ఏమైనా ఉందంటే వారిని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదన్నదే. ప్రపంచం అంతటా పురుషాధిక్యత పెరిగిపోయిన నేటి రోజుల్లో ఆడపిల్లలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. విమానాలు రైళ్లు నడుపుతున్నారు. అయినా వారి పరిస్థితి నానాటికీ మరింత దయనీయంగానే ఉంటోంది. బాపట్ల జిల్లా రేపల్లెలో కోచింగ్ సెంటర్ ముసుగులో సదరు నిర్వాహకుడు బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఆలయంలో నిద్రిస్తున్న ఓ మహిళ పై కొంతమంది యువకులు అత్యాచార యత్నం చేశారు. దీనికి ముందు రోజు దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
రెండు రోజుల క్రితం కడప జిల్లా పులివెందులలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక ఓ మృగాడి వికృత చేష్టలకు బలైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కోకోల్లలు జరుగుతున్నాయి. దిశా చట్టమని, ఫోక్సో చట్టమని ఎన్నో కఠినమైన చట్టాలను ప్రభుత్వాలు చేస్తున్నా మృగాళ్లు పట్టించుకోవడం లేదు. అనుక్షణం అభద్రతాభావంతో తల్లడిల్లే పసిమొగ్గలు, మన ఆడవాళ్లు ఎందరో ఈ బాధలు పడలేక ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానుగా పుట్టినా బావుండని కన్నీరు పెట్టుకొనే దుస్థితికి వచ్చారు.
ఆడపిల్లగా పుట్టడమే పాపంగానో,శాపంగానో భావించే దుస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. పసిపాపగా పుట్టి చెల్లిగా, ఇల్లాలిగా, తల్లిగా ప్రపంచానికి ఆత్మీయతను బంధాలను ప్రేమానురాగాలను నేర్పేందుకు వచ్చిన దేవతకు ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లలో. మన పాలకులు మహిళల రక్షణ కోసం ఎప్పటికప్పుడు ఎన్నో కఠినమైన చట్టాలు చేస్తున్నా అబలలకు మాత్రం అవి రక్షణను ఇవ్వలేకపోతున్నాయి.