రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ లేదని, మహిళలపై అత్యాచారాలు జరగడం అత్యంత దారుణమని మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అన్నారు. సోమవారం అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విజయవాడ లో మైనర్ బాలిక అత్యాచారానికి గురైన ఈ సంఘటన మరువక ముందే రేపల్లెలో గర్భిణీపై అత్యాచారం జరగడం అత్యంత హేయమైన చర్య అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు దిశ చట్టాన్ని ఏర్పాటు చేశానని చెబుతున్నప్పటికీ ఎక్కడ చూసినా అత్యాచారాలు మహిళలపై హత్యలు జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నేతలు పాల్గొన్నారు.