కొందరు పోలీసుల వ్యవహార శైలి కారణంగా మొత్తం డిపార్ట్‌మెంట్ నిందలు మోయాల్సి వస్తోంది. తాజాగా ఓ ఇంటికి తనిఖీల పేరుతో వెళ్లిన పోలీసులు దారుణానికి పాల్పడ్డారు. ఓ కేసులో అనుమానితుడైన తండ్రి కోసం వెతికితే దొరకలేదని, అతని కుమార్తెను లాఠీలతో చావగొట్టారు. వారి దెబ్బలు తాళలేక ఆ అమ్మాయి సంఘటనా స్థలంలోనే కన్నుమూసింది. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌలీ ప్రాంతం మన్‌రాగ్‌పూర్ గ్రామంలో ఆదివారం ఓ ఇసుక వ్యాపారి కోసం పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. ఇంటిని మొత్తం వెతికినా అతడు కనిపించలేదు. ఈ క్రమంలో అతడి గురించి ఆరా తీసి, దొరక్కపోవడంతో అసహనంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న అతడి పెద్ద కుమార్తె(24)పై తమ ప్రతాపం చూపించారు. లాఠీలతో పోలీసులు ఆమెను తీవ్రంగా కొట్టారు. వారి దెబ్బలను తట్టుకోలేక ఆమె అరిచినా, వారు కనికరించలేదు. చివరికి అక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వచ్చి పోలీసులపై దాడి చేశారు. గ్రామస్తుల దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆ తర్వాత మృతురాలి సోదరి మీడియాతో మాట్లాడింది. వేరే గదిలో తమ అక్కను పోలీసులు బాగా కొట్టారని, వారి దెబ్బలకు ఆమె గట్టిగా కేకలు పెట్టిందన్నారు. కొంత సేపటికి కేకలు ఆగిపోయాయని, తాను వెళ్లి చూడగా పోలీసులు ఫ్యాన్‌కు వేలాడదీస్తూ ఆత్మహత్యగా చిత్రీకరించారని బోరున ఏడ్చింది. ఈ అంశంపై యూపీ అంతటా తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి మృతికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.