ఆంద్రా లో జరుగుతున్న అత్యాచారాలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో సామూహిక అత్యాచారానికి గురైన మహిళ ప్రస్తుతం ఒంగోలు రిమ్స్‌లో కోలుకుంటోందన్నారు. ఆమెకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు వాటిపై ప్రతిపక్షాలు రాజకీయాల కోసం హైలైట్ చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిందితులపై కేసులు పెట్టడానికి మీనమేషాలు లెక్కించారని, తాము మాత్రం ఘటనలు జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకుని కటకటాల్లోకి నెడుతున్నామన్నారు. ఏపీలో వరుస అత్యాచారాలు జరగ్గానే ప్రతిపక్షాలు మన రాష్ట్రాన్ని బీహార్‌తో పోల్చడం దారుణమన్నారు.
ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాల వెనుక టీడీపీ నేతలు ఉన్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. రాజకీయ మైలేజీ కోసం మహిళలపై దాడులను రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి తరహా రాజకీయాలు సరికాదన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరుపున అవసరమైన సాయం అందిస్తామని చెప్పారు.