దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రోజు వారీ కరోనా కేసులు 3,451 నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారి బారిన పడి 40 మంది చనిపోయారు. నిన్న 3079 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా వెలుగు చూసిన కరోనా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,635కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,57,495కి చేరుకోగా మృతుల సంఖ్య 5,24,064కి పెరిగింది.
దేశంలో పరిస్థితి ఇలా ఉండగా పొరుగునే ఉన్న చైనాలో కరోనా విలయ తాండవ చేస్తోంది. ఆ దేశ ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కఠిన ఆంక్షలు విధించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారానికి రెండు నుంచి మూడు సార్లు అక్కడి ప్రజలకు చైనా సర్కారు కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. పాజిటివ్ కాకున్నా వారిని ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. కరోనా కట్టడి చేసేందుకే ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు.