తైవాన్ పై చైనా దేశం కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా ఆ దేశంపై యుద్ద నౌకలు, విమానాలను చైనా పంపిస్తోంది. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న వేళ.. దాని మిత్రదేశమైన చైనా తైవాన్‌పై కన్నేసిందనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. చైనా పదే పదే తన యుద్ధ నౌకలు, విమానాలను తైవాన్ పరిధిలోకి పంపిస్తూ.. ఆ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా 18 యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిన చైనా.. మరోసారి తీవ్రస్థాయిలో కవ్వింపులకు దిగింది. వాస్తవానికి గత ఏడాది చివరి నుంచి చైనా చొరబాట్లు పెరిగాయి. 2021 అక్టోబర్ 4న చైనాకు చెందిన 56 యుద్ధ విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి వెళ్లాయి. ఈ ఏడాది జనవరిలో చైనా 39 యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపింది.
ప్రపంచ దేశాలు తగిన రీతిలో స్పందించకపోతే.. ఉక్రెయిన్ ఆక్రమణ తరహాలోనే తైవాన్‌ను చైనా ఆక్రమించే ప్రమాదం ఉందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ.. పశ్చిమ దేశాలు తూర్పు యూరప్‌కు ఆయుధాలను అందించడంపై దృష్టి సారించాయని.. ఈ పరిస్థితులను చైనా తనకు అనుకూలంగా మలుచుకొని తైవాన్‌ను ఆక్రమించే అవకాశాలు లేకపోలేదని జపాన్ ప్రధాని వ్యాఖ్యానించారు. గ్రూప్-7 దేశాలు ఈ విషయంలో దీటుగా స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తన మదబలంతో (చైనా) మార్చేసే ప్రయత్నాల విషయంలో మన మిత్ర దేశాలు, మనలాగే ఆలోచించే దేశాలు ఏ మాత్రం ఉపేక్షించొద్దని జపాన్ ప్రధాని సూచించారు. తైవాన్ జలసంధి ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనడం ఒక్క జపాన్‌కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా ఎంతో అవసరమన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి చైనా తీరు పట్ల తైవాన్‌లో ఆందోళనలు పెరిగాయి. బీజింగ్ సైతం ఇదే రీతిలో ఆక్రమణకు దిగే ప్రమాదం ఉందని తైవాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండించని చైనా.. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చెబుతోంది. రష్యా చొరబాట్లను ఉక్రెయిన్ తిప్పికొడుతున్నట్లుగానే తాము కూడా చైనాను అడ్డుకోగలమని తైవాన్ ధీమాతో ఉంది. రష్యా దాడులు చేస్తున్నప్పటికీ 70 రోజులకుపైగా ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలిచిన తీరుపై తైవాన్ నాయకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. భవిష్యత్తులో చైనా నుంచి ముప్పు ఎదురైతే, ఒక వేళ బీజింగ్ ఆక్రమణకు సిద్ధపడితే.. అంతర్జాతీయ సమాజం తమకు మద్దతుగా నిలుస్తుందని.. చైనాపై ఆంక్షలు విధిస్తుందని ఆశిస్తున్నామని తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వు తెలిపారు.
కానీ ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. కానీ చైనా ఒత్తిడితో చాలా దేశాలు తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. అదీగాకుండా ప్రపంచ కర్మాగారంగా ఉన్న చైనా నుంచి ప్రపంచ దేశాలకు భారీ మొత్తంలో ఎగుమతులు జరుగుతుంటాయి. రష్యాతో పోలిస్తే చైనా ఆర్థికంగానూ బలంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. ఒకవేళ జిన్‌పింగ్ గనుక తైవాన్‌ను ఆక్రమించాలని భావిస్తే.. ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, పశ్చిమ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa