టెన్త్ క్లాస్ పశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, దీనికి కారణమైన నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నారాయణ సంస్థల పర్యవేక్షణలోనే మాల్ ప్రాక్టీస్ జరిగిందని, పేపర్ లీక్‌పై ఏదో ప్రచారం చేయాలని చూస్తే వికటించి వాళ్లకే తగిలిందన్నారు. నారాయణ విద్యా సంస్థల పర్యవేక్షణలోనే పేపర్ లీక్ జరిగిందని, పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ నారాయణ, శ్రీచైతన్య సంస్థల నుంచే వచ్చాయన్నారు. రికార్డుల కోసం నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ర్యాంకుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.