ఆసాని తుఫాన్ కారణంగా నంద్యాల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమరి లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో మొదలై ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాత్రంతా కురిసింది. దీంతో మండలంలోని పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ కారణంగా మంగళవారం రాత్రి నుంచి చాగలమరి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇదిలా ఉంటే అసాని తుఫాన్ కారణంగా మండలంలో సాగులో వున్న పంటపొలాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా మామిడితోటల్లో కాయలు రాలిపడడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.