షవర్మా ఓ అమ్మాయి ప్రాణాలను తీసింది. షవర్మా తిని అస్వస్థతకు గురై 16 ఏళ్ల అమ్మాయి మృతి చెందిన ఘటన కేరళలోని కాసర్‌గఢ్‌లో చోటు చేసుకుంది. మరో 18 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఆహారం కలుషితం కావడం వల్లే ఈ విషాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. ట్యూషన్ కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ జ్యూస్ షాపులో విద్యార్థులు షవర్మా తిన్న తర్వాత అనారోగ్యం పాలయ్యారు. జ్యూస్ షాపులో షవర్మా తినడం వల్ల 18 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారందరికీ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషాదానికి కారణమైన జ్యూస్ షాపుపై కేసు నమోదు చేసి, సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
కాసర్‌గఢ్‌లోని కరివల్లూర్‌కు చెందిన దేవానంద (16) ఆదివారం (మే 1) సాయంత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి సదరు జ్యూస్ షాపునకు వెళ్లింది. జ్యూస్ షాపులో షవర్మా తిన్న కాసేపటికే అస్వస్థతకు గురైంది. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం కన్హాన్‌గఢ్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ అమ్మాయి మృతి చెందింది.
జిల్లా ఆస్పత్రిలో మొత్తం 18 మంది విద్యార్థులు అడ్మిట్ అయ్యారని.. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కన్హాన్‌గఢ్ జిల్లా వైద్యాధికారి ఏవీ రాందాస్ తెలిపారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చని.. అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులకు సూచించినట్లు చెప్పారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి ఎంవీ గోవిందన్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని హోటళ్లలో నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తాం. నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి గోవిందన్ అన్నారు.
షవర్మా అంటే ఏమిటి?
షవర్మా అనేది మాంసంతో తయారు చేసే ఒక పదార్థం. ఎక్కువగా చికెన్‌ను ఉపయోగించి దీన్ని రూపొందిస్తారు. మేక మాంసం, బీఫ్ లాంటి వాటిని కూడా ఉపయోగిస్తారు. మాంసంతో పాటు కొన్ని రకాల కూరగాయలను కూడా వాడతారు.