సాధారణంగా కొన్ని సందర్భాల్లో బస్సు నడుపుతూ కొందరు డ్రైవర్లకు గుండెపోటు వచ్చిన వార్తలు వినే ఉంటాం. ఆయా సందర్భాల్లో బస్సును క్షేమంగా పక్కకు ఆపి ప్రాణాలు విడిచిన డ్రైవర్ల గురించి తెలుసుకుని అయ్యో అనుకుంటాం. అయితే ఇదే తరహా ఘటన ఓ విమానం విషయంలో చోటు చేసుకుంది. విమానం నడుపుతుండగా పైలట్ స్పృహ తప్పిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు హడలెత్తారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
అమెరికాలోని ఫ్లోరిడాలో గురువారం ఓ చిన్నపాటి విమానం టేకాఫ్ అయింది. కాసేపటికే పైలట్ స్పృహ తప్పి కనిపించాడు. దీంతో అందులో ఉన్న ఓ ప్రయాణికుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను సంప్రదించాడు. విమానం కాక్‌పిట్‌లో రేడియో ద్వారా సంప్రదింపులు జరిపాడు. తమ పైలట్ స్పృహ తప్పాడని, ఏం చేయాలో తెలియడం లేదని ఆందోళనతో సదరు ప్రయాణికుడు సాయం కోసం అభ్యర్థించాడు. ఈ తరుణంలో రాబర్ట్ మోర్గాన్ అనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు పరిస్థితి అర్థం అయింది. ఆ ప్రయాణికుడిని ఆందోళన చెందవద్దని చెప్పి, అతడికి సూచనలిస్తూ విమానం ఎక్కడుందో తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేయాలో చెబుతూ విమానాన్ని పాల్మ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేలా చేశారు. ఆ వెంటనే విమానాశ్రయ సహాయక సిబ్బంది హుటాహుటిన అక్కడకు వచ్చి పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. తనకు పైలట్‌లు కూర్చుని నడిపే కాక్‌పిట్ గురించి అవగాహన లేదని, తానున్న చోటు నుంచే విమానాన్ని నియంత్రించేలా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలిచ్చారని సదరు ప్రయాణికుడు చెప్పాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించినట్లు పేర్కొన్నాడు.