దేశవ్యాప్తంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 29 ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల చొప్పున గురువారం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46-47 డిగ్రీల సెల్సియస్‌కు దూసుకెళ్లవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఉత్తర భారతంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో 48 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ అల్పపీడనంగా మారింది. దీంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో మోస్తరు స్థాయిలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.