ఏపీలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గుడ్ న్యూస్ అందించనుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేడు ఉదయం 10.10 గంటలకు 'వైఎస్ఆర్ రైతు భరోసా' నిధులు జమ చేయనుంది. ఏటా మూడు విడతల్లో రూ.13,500ల పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరిట రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. తొలి విడతలో భాగంగా రూ.5,500లను రైతులకు నేడు అందించనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.2,000లను ఈ నెల 31న రైతుల బ్యాంకు ఖాతాలో వేయనుంది. పథకంలో భాగంగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి గానూ 50,10,275 రైతులకు రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది. ఏలూరు జిల్లాలోని గణపవరం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో సోమవారం ఉదయం 10.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్‌లో బటన్ నొక్కి రైతుభరోసా నిధులు జమ చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఏటా మే నెలలో రూ.7,500, అక్టోబర్ నెలలో రూ.4 వేలు, జనవరిలో మిగిలిన రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు.