శ్రీలంకలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. శ్రీలంకలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని శ్రీలంక అధ్యక్షుడు గోటభయ రాజపక్సే ప్రకటించారు. రోజురోజుకు ఆందోళనలతో పరిస్థితి విషమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధులతో చర్చలు జరిపారు.1848 తర్వాత శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తడం ఇదే తొలిసారి. విదేశీ మారకద్రవ్య నిధుల కొరత కారణంగా పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు పెద్దఎత్తున క్యూలో నిలబడాల్సి వస్తోంది. కరెంటు కోతలు, తిండి గింజల ధరలు పెరగడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం మళ్లీ రాజకీయ సంక్షోభం వైపు పయనిస్తోంది. రాజపక్సేలు రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.