ఐపీఎల్-2022 సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తులు కోల్పోయిన ముంబై, హైదరాబాద్ జట్లు నేడు వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30కి తలపడనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టుకు ఈ సీజన్ ఏ మాత్రం కలిసి రాలేదు. ఆ జట్టులో కోర్ టీమ్ మొత్తం మారిపోయింది. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య వంటి ఆ జట్టు కీలక ఆటగాళ్లు ఇతర జట్లకు వెళ్లిపోయారు. ఇక జట్టును ముందుండి నడిపించాల్సిన రోహిత్ శర్మ బ్యాటింగ్‌లోనూ, కెప్టెన్సీలోనూ ఈ ఏడాది ఏ మాత్రం ప్రభావం చూపించ లేకపోయాడు. ఫలితంగా ఆ జట్టు ఆడిన తొలి 8 మ్యాచ్‌లలోనూ పరాజయం ఎదురైంది. ఆ తర్వాత గాడిన పడినా, అప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి.
మరో వైపు వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి ఆశలు రేకెత్తించిన హైదరాబాద్ జట్టు ప్రస్తుతం చతికిల పడింది. ఇటీవల ఆ జట్టు ఆడిన చివరి ఐదు మ్యాచ్‌లలోనూ పరాజయం పాలైంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు మరో విజయం సాధించి పరువు దక్కించుకోవాలని పోరాడనున్నాయి. ఐపీఎల్ చివరి మ్యాచ్‌లను విజయాలతో ముగించాలని భావిస్తున్నాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది.