తన వద్ద ఓ వృద్ధుడు మైనర్ బాలికను నిబంధనలకు విరుద్ధంగా పనిలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలిక ఎదుగుతున్న క్రమంలో ఆమెపై కన్నేశాడు. తన వయసును సైతం మరిచి, ఆమెను నిత్యం లైంగిక వేధింపులకు గురి చేసే వాడు. చివరికి విషయం పోలీసులకు తెలియడంతో కటకటాల వెనక్కి చేరాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో 81 ఏళ్ల వృద్ధుడు మౌరిస్ రైడర్, ఓ మహిళతో కలిసి నివసిస్తున్నాడు. వారి వద్ద పని చేసేందుకు ఓ బాలికను ఏడేళ్ల క్రితం ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం ఆ బాలికకు 17 ఏళ్లు. ఏడేళ్లుగా తనపై జరుగుతున్న అకృత్యాలను వృద్ధుడితో కలిసి నివసిస్తున్న మహిళకు ఇటీవల బాధిత బాలిక చెప్పి బోరుమంది. ఆ తర్వాత వారు ఈ దారుణాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో 'డిజిటల్ రేప్'ఆరోపణలతో 81 ఏళ్ల వ్యక్తిని గౌతమ్ బుద్ నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
వృత్తిరీత్యా కళాకారుడైన ఆ వృద్ధుడికి హిమాచల్ ప్రదేశ్‌లో కార్యాలయం ఉందని పోలీసులు తెలిపారు. అతని వద్ద పని చేసే వ్యక్తి కుమార్తెకు విద్య అందిస్తానని చెప్పి నోయిడాకు తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. తనపై లైంగిక వేధింపులను ఆమె ఆడియో ఫైళ్లుగా రికార్డు చేసి, తమకు అందించిన పోలీసులు వివరించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేసినట్లు నోయిడా అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ రణవిజయ్ సింగ్ చెప్పారు.
‘డిజిటల్ రేప్’ అంటే పునరుత్పత్తి అవయవం(పురుషాంగం) కాకుండా మరేదైనా వస్తువును ఉపయోగించి స్త్రీ లేదా అమ్మాయితో బలవంతంగా సెక్స్ చేయడం. ఇది అత్యాచారం పరిధిలోకి రాదు. అయితే 2012 నిర్భయ కేసు తర్వాత దీనిని 'డిజిటల్ రేప్'గా పరిగణించి, నిందితులను అరెస్టు చేస్తున్నారు. యూపీలో ఈ తరహా కేసు ఇది రెండవది.