భారత దేశంలో నేటికీ అధిక శాతం వ్యవసాయంపైనే ఆధార పడి జీవిస్తున్నారు. అయితే పంట చేతికి వచ్చే వరకు రైతుకు కంటి మీద కునుకు ఉండడం లేదు. పురులు, చీడ పీడలు పంటకు పడితే రైతు కన్నీరు పెడుతున్నాడు. అంతేకాకుండా ఎరువులు, పురుగల మందులకు శక్తి మించి వ్యయం చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలో వరి సాగులో చేపల పెంపకం చేపడితే బాగుంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. చైనా, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ వంటి పలు దేశాల్లో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. దీంతో ఈ విధానాన్ని దేశంలోనూ ప్రవేశపెట్టాలనే ఆలోచనలున్నాయి. ఫలితంగా రైతుకు సాగు భారం కాకుండా చేయాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.
వరి మడులకు నీటి అవసరం ఎక్కువ పడుతుంది. పంట చేతికందే వరకు ఎక్కువ కాలం మడులన్నీ నీటితోనే ఉంటాయి. దీంతో వరి సాగు సమయంలో అంతర పంటలు వేయలేరు. అయితే ప్రతి మడిలో వరి చుట్టూ, గట్టు వెంబడి ఆరు అడుగుల వెడల్పుతో గుంత తవ్వి, అందులో చేపలు పెంచొచ్చు. బొచ్చె, కొరమీను, రోహు, తిలాపియా తదితర రకాల చేపలను అందులో పెంచొచ్చు. చేపలు తినగా మిగిలిన ఆహారం, అవి వదిలిన విసర్జితాలు వరికి ఎరువుల లాగా ఉపయోగపడతాయి. దీని వల్ల పంట దిగుబడి 20 శాతం మేర పెరుగుతుంది. క్రిమి కీటకాలు, పురుగులను చేపలు తినేయడంతో పంట కూడా బాగా పండుతుంది. 'వరి–చేపలు' కలిపి చేసే సాగుతో రైతుకు 30శాతం ఎక్కువ ఆదాయం సమకూరుతోందని వివిధ దేశాల్లో చేపట్టిన అధ్యయనంలో తేలింది. రైతుకు పాడి పరిశ్రమతో పాటు ఇటువంటి సాగు వల్ల వ్యవసాయం భారం కాదని నిపుణులు సూచిస్తున్నారు.