ప్రధాని నరేంద్ర మోడీకి కర్నాటక యువకులు రాసిన లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని కొందరు యువకులు ఆవేదన చెందారు. ఏకంగా రక్తంతో లేఖ రాసి, దానిని ఇటీవల ప్రధాని మోడీకి పంపించారు. కష్టపడి చదువుకున్న తాము ఉద్యోగాలు సాధించలేకపోయామని వారు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో డబ్బులున్న వారికే ఉద్యోగాలు వస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగ నియామకాలలో అక్రమాలు తీవ్రంగా జరుగుతున్నాయని, వాటిని చక్కదిద్దాలని ప్రధానిని కోరారు. పరిస్థితిని ప్రధాన మంత్రి చక్కదిద్దుతారనే నమ్మకం తమకు ఉందని, దయచేసి నిజాయితీగా కష్టపడే వారికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఎస్ఐ ఉద్యోగార్థులు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మొత్తం 8 మంది లేఖ రాశామని అందులో పేర్కొన్నారు. అయితే తమ పేర్లు లేకుండా వారంతా జాగ్రత్తపడ్డారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని, ప్రతిభకు పట్టం కట్టాలని అందులో వారు కోరారు. లేకుంటే తాము మావోయిస్టుల్లో చేరతామని హెచ్చరించారు. ఉద్యోగ నియామకాలపై విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. కర్నాటకలో వీరు రాసిన లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.