దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. ఇటీవల కాలంలో రోజుకు మూడు వేల చొప్పున నమోదవుతున్నాయి. తాగా గత 24 గంటల్లో ఈ సంఖ్య భారీగా తగ్గింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పడిపోయింది. దీంతో ప్రజలకు ఊరట లభించినట్లైంది. గత 24 గంటల్లో 3.57 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 1,569 మందికి కరోనా పాజిటివ్‌గా వెలుగు చూసింది. దీంతో అంతకు ముందు రోజు కంటే 600 వరకు కేసుల సంఖ్య తగ్గింది. దీంతో రోజువారీ పాజివిటీ రేటు 0.44 శాతానికి పెరిగింది.
ఇటీవల కాలంలో పొరుగు దేశం చైనాలో కరోనా విజృంభించింది. మన దేశంలో ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలలో గరిష్ట స్థాయిల కేసుల నమోదు, మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో భారత్‌లో ఫోర్త్ వేవ్ వస్తుందనే భయాలు వెంటాడాయి. అయితే అందుకు భిన్నంగా కరోనా కేసులు తగ్గుదల కనిపిస్తుండడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ మహమ్మారి బారి నుంచి 2,467 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 5.24 లక్షలు దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.