త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత హార్దిక్ పటేల్ బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మే 15న ఉదయ్‌పూర్‌లో జరిగిన మూడు రోజుల కాంగ్రెస్ అగ్ర నాయకుల మేధోమథన సమావేశం కారణంగా తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. అది పూర్తవడంతో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత పాటిదార్ సామాజిక తరగతికి చెందిన ప్రభావవంతమైన నాయకుడు నరేష్ పటేల్‌ను ఆయన కలిశారు. వీలైనంత త్వరగా రాజకీయాల్లోకి రావాలని నరేష్‌ను ఆయన అభ్యర్థించారు.
పాటిదార్ ఉద్యమం కారణంగా హార్దిక్ పటేల్ ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఎదిగాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల తీరుతో కొంత కాలంగా ఈ 28 ఏళ్ల హార్దిక్ పటేల్ గుర్రుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శిస్తున్నాడు. పార్టీ కార్యక్రమాలకు తనకు ఆహ్వానం అందడం లేదని కొంతకాలంగా హార్దిక్ ఆరోపిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో హార్దిక్ పటేల్ రాష్ట్రంలోని అధికార పార్టీ బీజేపీలో చేరే అవకాశం ఉందని గుజరాత్‌లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.