కాంగ్రెస్ పార్టీకి కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్. పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా, ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభివృద్ధి కోసం నిర్వహించిన మేధోమథన సదస్సు 'చింతన్ శిబిర్' వల్ల కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదని చెప్పారు. ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై తాజాగా ట్విట్టర్‌లోనూ పలువురు అడిగిన ప్రశ్నలకు శుక్రవారం సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఆయన వ్యాఖ్యానించారు.
చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు రానున్న ఎన్నికల్లో ఓటమిని తప్పించే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న స్థితినే ఎన్నికల వరకు కొనసాగించడానికి ఉపయోగపడతాయని అన్నారు. అర్థవంతమైన ఫలితాలను సాధించ లేకపోయిందని చింతన్ శిబిర్‌పై విమర్శలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న క్రమంలో ప్రశాంత్ కిశోర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.