శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడుతోంది. ఈ క్రమంలో 5జీ టెక్నాలజీని దేశ ప్రజలకు అందించే క్రమంలో ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఐఐటీ మద్రాస్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన పరికారలతో 5జీ వీడియో కాల్ ట్రయల్స్ చేపట్టినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 'ఆత్మనిర్భర్‌లో భాగంగా ఐఐటీ మద్రాస్‌లో 5జీ కాల్‌ను విజయవంతంగా పరీక్షించాం. దీనిని పూర్తిగా భారత్‌లోనే అభివృద్ధి చేశారు' అని గురువారం కేంద్ర మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
దీంతో త్వరలో భారతదేశంలో 5జీ సేవలను పొందనుందని తెలుస్తోంది. ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్ వేలంపాటలను ముగించిన తర్వాత ఈ ఏడాది చివర్లో రోల్ అవుట్ ప్రారంభమవుతుంది. రాబోయే కొద్ది నెలల్లో భారతదేశంలో 5జీ అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో 5జీ కోసం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన దాని భాగాలు, పరికరాల కోసం విస్తృతమైన పరీక్షలు చేపడుతున్నారు. తాజాగా ఇవి విజయవంతం అయినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీంతో ప్రధాని మోడీ మదిలోని ఆత్మనిర్భర్ ఆకాంక్ష సాధ్యమైనట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయనే అంచనాలు ఉన్నాయి.