అదునుచూసి టారీఫ్ ధరలను పెంచి కస్టమర్లకు వాత పెడుతున్న ఎయిర్ టెల్ మరోసారి తన టారీఫ్ ధరలను పెంచేందుకు సిద్దమవుతోంది. గతేడాది నవంబర్ లో ముందుగా టారిఫ్ లను పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించగా.. వొడాఫోన్ ఐడియా, జియో అనుసరించేశాయి. ఇప్పుడు కూడా చార్జీల పెంపును ముందుగా ఎయిర్ టెల్ అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయాన్ని రూ.300-400కు తీసుకెళ్లాలన్నది ఎయిర్ టెల్ వ్యూహం. దీన్ని ఆ సంస్థ అధినేత సునీల్ మిట్టల్ ఏడాది క్రితమే ప్రకటించారు.
ఇదిలావుంటే టెలికం కంపెనీలు మొబైల్ ప్రీపెయిడ్ టారిఫ్ లను గత నవంబర్-డిసెంబర్ లో పెంచడం గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా 18-25 శాతం మేర టారిఫ్ లను పెంచేశాయి. ఇప్పుడు మరో విడత పెంపునకు కంపెనీలు సిద్ధమవుతున్నట్టు ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ మాటలను బట్టి తెలుస్తోంది. 2022లోనూ చార్జీలను పెంచనున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు.
మార్చి చివరికి ఎయిర్ టెల్ కు ఒక్కో యూజర్ నుంచి ప్రతినెలా సగటున రూ.178 ఆదాయం వచ్చింది. దీన్ని రూ.200కు తీసుకెళ్లనున్నట్టు గోపాల్ విట్టల్ చెప్పారు. ఇప్పటికీ ప్రీపెయిడ్ టారిఫ్ లు చాలా తక్కువ ధరలవద్దే ఉన్నాయంటూ, మొదటగా రూ.200కు అయినా తీసుకెళ్లాల్సి ఉందన్నారు. అంటే కనీసం 10 శాతానికి పైన, 20 శాతం వరకు (కొన్ని ప్యాక్ ల ధరలు) ధరలు పెంచే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.