అంగన్‌వాడీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర నాయకులు జి. ఓబులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌లో కలెక్టర్ ఎస్. నాగలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్మికులకు మార్చి, ఏఫ్రిల్ నెలలకు సంబంధించి వేతనాలు చెల్లించలేదన్నారు. ఇంతకు మునుపు ప్రాజెక్టుల స్థాయిలోనే వేతనాలు ఇచ్చేవారని, దాని వల్ల ఎవరెవరికి చెల్లించారు, ఎవరికి చెల్లించలేదో తెలిసిపోయేదన్నారు. వేతనాలు రాని వారు వెంటనే ప్రాజెక్టు స్థాయిలోనే సరిచేసి వెంటనే వేతనాలు చెల్లించే వారని తెలిపారు.
కాని ప్రతి ప్రాజెక్టులోను 2021వ బ్యాచ్‌లో జాయిన్ అయిన వాళ్లకు కొన్ని ప్రాజెక్టులలో ఇంకా కొన్ని నెలల వేతనాలు బకాయిపడ్డాయని తెలిపారు. వారి వేతనాలు వాళ్ల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలన్నారు. కొన్ని ప్రాజెక్టులలో గ్యాస్ బిల్లులు, సెంటర్ అద్దెలు, కూరగాయల బిల్లులు చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. 3 నెలల ముందు ప్రాజెక్టు స్థాయిలో యూనియన్ నాయకులు, సిడిపిఒలతో జాయింట్ మీటింగ్ నిర్వహించారని తెలిపారు. అన్ని ప్రాజెక్టులలో ప్రాజెక్టు స్థాయి జాయింట్ మీటింగ్‌తో పాటు, జిల్లాలో జాయింట్ కలెక్టర్, సిడిపిఒ, పీడీ, యూనియన్ నాయకులతో జాయింట్ మీటింగ్ నిర్వహించాలన్నారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు చెల్లించాలని కోరారు.
ఉద్యోగ విరమణ సదుపాయాలనూ కల్పించాలన్నారు. పదోన్నతులు కల్పించిన తరువాతనే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్రకుమార్, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల, నగర అధ్యక్ష, కార్యదర్శులు జమున, నక్షత్ర పాల్గొన్నారు.