మసాలా ఆహారాలు తీసుకోవడం, నీరు తక్కువగా తాగడం, అదే పనిగా కుర్చీలో కూర్చొని పనిచేయడం వంటి కారణాల వల్ల శరీరంలో వేడి ఎక్కువవుతుంది. దీని వలన మూత్ర విసర్జన సమయంలో చాలా మంటగా, నొప్పి కలుగుతుంది. అయితే మనం శరీరంలోని వేడిని అతి సులభంగా మన ఇంట్లో ఉన్న పదార్థాలను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్ర, పటిక బెల్లం వేసి 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి. జీలకర్ర, పటిక బెల్లంలు మన శరీర వేడిని తగ్గించడానికి సహాయపడతాయి. నానబెట్టిన జీలకర్ర, పటిక బెల్లం కలిపిన నీటిని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇలా మీరు రోజులో ఒక రెండు సార్లు తాగాలి.
జీలకర్ర, పటిక బెల్లంలు సమానంగా తీసుకొని మిక్సీలో పొడిలా చేసుకుని ఒక డబ్బాలో నిలువ చేసుకోవాలి. రోజూ ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ పొడిని కలిపి తాగాలి. ఇలా రోజులో రెండు సార్లు తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో మంట వంటివి కూడా ఇబ్బంది పెట్టవు.
మజ్జిగలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తాగితే శరీరంలో అతి వేడిని తగ్గించుకోవచ్చు.
మూడు నాలుగు టీ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని ఒక 4 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన సబ్జా గింజలను ఒక గ్లాసులోకి తీసుకొని మరి కొన్ని నీటిని కలుపుకొని అందులో ఒక అర చెక్క నిమ్మరసాన్ని పిండాలి. ఇలా తయారు చేసిన పానీయాన్ని తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది.