ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం కోర్టులో కేసు పెట్టారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తే వరుసగా పోలీస్ కేసులు పెట్టి రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని చింతమనేని ఆరోపించారు. ఏలూరు కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ఇతరులపై ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తనను టార్గెట్ చేసి, పోలీసు కేసులు పెట్టిస్తున్నారని ఆయన వాపోయారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
తనపై రెండేళ్ల కాలంలో దాదాపు 25 కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. ఇవన్నీ రాజకీయ వేధింపులేనని చెప్పారు. ప్రజాసమస్యలపై తాను ఆందోళన చేపట్టినా, నిరసన కార్యక్రమాలను నిర్వహించినా పోలీసులు కేసులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రోద్భలంతోనే తనపై కేసులు నమోదయ్యాయయన్నారు. వారితో పాటు పోలీస్ అధికారులు రాహుల్ దేవ్‌శర్మ, నవజ్యోత్ సింగ్ గ్రేవాల్, కృష్ణారావు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలను కూడా తన వ్యాజ్యంలో పేర్లు చేర్చారు.