మీడియా– రాజకీయాలు – వ్యవస్థలన్నీ కలిసిపోయి ఒక వర్గానికే కొమ్ముకాస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారికి వ్యతిరేకంగా జెండా ఎగురవేసి నెగ్గటమే ఒక చరిత్ర. ఆ తరవాత కూడా కుట్రలను తిప్పికొడుతూ దిగ్విజయంగా ముందుకెళ్లటం మరో చరిత్ర. అలా ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త చరిత్రను రాసుకుంటూ ముందుకెళుతోంది అని వైసీపీ పార్టీ మంత్రులు సామజిక న్యాయ భేరి కార్యక్రమంలో వాపోయారు. అలానే... విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో సమూల మార్పులు మొదలయ్యాయి. ఎలాంటి సంక్షోభ సమయంలోనైనా పేదల బతుక్కి ఢోకా లేదన్న భరోసా ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఏ ఆధారం లేని వృద్ధులు సహా పలు వర్గాలకు ఠంచన్‌గా ఒకటో తేదీనే పింఛను నడుచుకుంటూ ఇంటికొస్తోంది.
దాదాపు 31 లక్షల మందికిపైగా పేద కుటుంబాల సొంతింటి కల... స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తరవాత నెరవేరుతోంది. మహిళలు చిరు వ్యాపారాలు సైతం చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడ్డారు. ఒకటేమిటి... చెప్పుకుంటూ పోతే మూడేళ్లలో ఈ రాష్ట్రం ఎన్నో మార్పులు చూసింది. మూడేళ్ల కిందటి కంటే తామిప్పుడు బాగున్నామనేది ఇక్కడి ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్న నిజం. మున్ముందు మరింత బాగుంటామన్న నమ్మకమూ వారికుంది. మూడేళ్ల కిందట మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి... అభివృద్ధికిచ్చే నిర్వచనమిది అని కొనియాడారు.