వానొచ్చినా, వాంతికొచ్చినా ఆగవు అనేది నిజమే. అయితే వాంతి అయ్యే ముందు మన మెదడుకు సూచనలు అందినట్టే... వానొచ్చే ముందు కూడా వాతావరణ విభాగానికి సంకేతాలు అందుతాయి. దాన్ని బట్టే మన ప్రోగ్రాములు ప్లాన్ చేసుకోవడం, అవసరమైన మేరకు మార్పుచేర్పులు చేసుకోవడం జరుగుతుంది. మరి.. మొన్న ఢిల్లీలో అంత సడన్గా అంత భారీ వర్షం ఎలా పడింది? భీకరమైన గాలులు ఎలా సంభవించాయి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
మొన్న సోమవారం ఢిల్లీని అనుకోని అతిథిలా వరుణుడు చుట్టేశాడు. మధ్యాహ్నం వరకు ఎలాంటి సంకేతాలు కానీ, ఉరుములు, మెరుపులు ఎలాంటి సందడీ కనిపించలేదు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీయడం మొదలైంది. దాని వెనుకే ఉన్నట్టుండి కుండాపోతగా వరుణుడు దంచి కొట్టాడు. గంటకు 100 కిలోమీటర్ల గాలి వేగానికి బలమైన చెట్లు కూడా కూకటి వేళ్లు సహా పెకిలించుకొని నేలకొరిగిపోయాయి. ఫోర్ వీలర్లు చెట్ల కింద చిత్తయిపోయాయి. రోడ్లు బ్లాకైపోయాయి. రవాణా స్తంభించిపోయింది. ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయారు. కార్యాలయాలకు వెళ్లినవాళ్లు ఇళ్లకు చేరుకోలేకపోయారు. కొన్ని గంటలపాటు వరుణుడు సృష్టించిన బీభత్సానికి ఢిల్లీ ప్రజలు తల్లడిల్లిపోయారు. ఊహించని ఆస్తి నష్టం సంభవించింది.