కావలసిన పదార్థాలు : అల్లం - 50గ్రా., నిమ్మకాయ - 1, పుదీనా ఆకులు - కొన్ని, పంచదార - పావుకేజీ, ఐస్ క్యూబ్స్ - కొన్ని, సోడా.
తయారీవిధానం: అల్లం నిమ్మకాయలతో రెఫ్రెషింగ్ డ్రింక్ తయారు చెయ్యటానికి ముందు అల్లం సిరప్ ను తయారు చేసుకోవాలి. ఇందుకోసం అల్లాన్ని నీటితో బాగా శుభ్రపరిచి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. రెండు కప్పుల అల్లానికి, ఐదు కప్పుల నీటిని జోడించి ఒక గిన్నెలో పావుగంట సేపు మరగబెట్టాలి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత వడకట్టుకోవాలి. అల్లం ముక్కలను సెపరేట్ చేసి, నీటిని వేరే గిన్నెలో పోసుకోవాలి. ఇందులో రుచికి తగ్గట్టు పంచదారను వేసి అది కరిగేంతవరకు పొయ్యి మీద పెట్టాలి. పంచదార కరిగిన తర్వాత అల్లం సిరప్ ను ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లబరచుకోవాలి. ఈ సిరప్ ఫ్రిడ్జ్ లో పెడితే నెలపాటు నిల్వ ఉంటుంది.
అల్లం సిరప్ తయారుచేసుకున్న తర్వాత, ఒక గ్లాసును తీసుకుని అందులో రెండు స్పూన్ల అల్లం సిరప్ ను, నిమ్మకాయ రసాన్ని, అలాగే రెండు మూడు నిమ్మకాయ ముక్కలను, కొన్ని పుదీనా ఆకులను వేసుకోవాలి. స్పూనుతో బాగా కలిపిన తర్వాత ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని గ్లాసు నిండేంత వరకు సోడా పోసుకోవాలి. ఎండాకాలంలోనే కాదు... అలసటగా అనిపించినపుడు మనకు రిఫ్రెష్ కలిగించే ఈ డ్రింక్ ను మీరు కూడా ట్రై చెయ్యండి.