రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలనంతా బాదుడే బాదుడుగా కొనసాగుతుందని టీడీపీ నేత కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం పెద్దకడబూరు మండల పరిధిలోని తారాపురంలో శ్రీ గిడ్డాంజనేయస్వామి సాక్షిగా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి సమక్షంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా తారాపురం టీడీపీ గ్రామ నాయకులు భరత్ కుమార్ కౌశిక్ తో కలిసి కోట్ల, ప్యాలకుర్తి శ్రీనివాసరెడ్డి, నరవ రమాకాంతరెడ్డి శ్రీ గిడ్డాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాజీ మంత్రి కోట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ మూడేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ మూడేళ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం తప్పా చేసిందేమిలేదని విమర్శించారు. అలాగే మంత్రాలయం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని, రాబోయే రోజుల్లో మంత్రాలయం నుండి ఎమ్మెల్యేగా తిక్కారెడ్డిని, కర్నూలు పార్లమెంటు నుండి ఎంపీగా తనను ఆదరించాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బసలదొడ్డి ఈరన్న, ఏసేపు, మధుసూదన్ రెడ్డి, మల్లికార్జున, మీ సేవ ఆంజనేయులు, తారాపురం నరసప్ప, దశరథరాముడు, నరసన్న, సుక్క నరసన్న, రామాంజనేయులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.