పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమహేశ్వరపాడులో 2019 ఎన్నికల తర్వాత వైసీపీ రౌడీల అరాచకాలను తట్టుకోలేక యాదవ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం సానుభూతిపరులు పక్క నియోజకవర్గాలకు పోయి తలదాచుకున్నారు అని సమాచారం. వారిలో తెలుగుదేశం కార్యకర్త కంచర్ల బక్కయ్య తన కొడుకు పెళ్ళి పనుల నిమిత్తం కంచర్ల జలయ్య, ఆవుల యల్లయ్యలతో కలిసి గ్రామానికి వచ్చారు. విషయం తెలిసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు మున్నయ్య 15 మంది వైసీపీ రౌడీలతో మించాలపాడు అడ్డరోడ్డు దగ్గర కాపుకాశాడు. తెలుగుదేశం కార్యకర్తల మీద రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేసిందే కాకుండా, వారి దగ్గర ఉన్న పెళ్లి డబ్బులు రూ.5 లక్షలు దోచుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలను ఆసుపత్రికి చేర్చగా చికిత్స పొందుతూ జలయ్య మరణించారు అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు. ఈ హత్య కేసును ప్రమాదంగా మార్చేందుకు పిన్నెల్లి కుట్ర చేస్తున్నారు అని తెలిపారు. టీడీపీ కార్యకర్తల మీద దాడి విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి నరసరావుపేట లోని ఆస్పత్రికి చేరుకున్నారు. జలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, దాడిలో గాయపడిన మిగిలిన కార్యకర్తలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.