కావలసిన పదార్ధాలు: అరటిపండు - 1, పంచదార - 2 స్పూన్లు, యాలకుల పొడి - కొద్దిగా, పెరుగు - 1 కప్, ఐస్ క్యూబ్స్ - కొన్ని, జీడిపప్పు - కొన్ని.
తయారీవిధానం: పుల్లటి లేదా నిల్వ పెరుగు కాకుండా తాజా కమ్మనైన పెరుగును వాడితే లస్సీ చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అరటిపండు తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి మిక్సర్ జార్ లోకి తీసుకోవాలి. ఒక కప్ తాజా పెరుగును కూడా అందులో వేసుకోవాలి. పంచదారను కాకుండా పంచదార పొడిని వాడితే జ్యూస్ లో బాగా కలిసిపోతుంది. అలానే యాలకులను కూడా మెత్తని పొడిలా చేసి పెట్టుకోవాలి. అరటిపండు ముక్కలు, పెరుగు ఉన్న మిక్సర్ జార్లో రెండు స్పూన్ల పంచదార పొడిని, నానబెట్టిన జీడిపప్పులను, చిటికెడు యాలకుల పొడిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.. అవసరమైతే నీటిని ఉపయోగించొచ్చు. అయితే, మరీ నీళ్లలా చేసుకుంటే జ్యూస్ రుచిగా ఉండదు. మంచి కన్సిస్టెన్సీ ని మెయిన్ టైన్ చేస్తే చూడటానికి, రుచికి రెండిటికి బావుంటుంది. ఇప్పుడొక గ్లాసు తీసుకుని నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకుని, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బనానా జ్యూస్ ను ఇందులో పోసుకోవాలి. గ్లాసు పైన కొన్ని ఎండు ద్రాక్షలను పెట్టి డెకరేషన్ చేస్తే రెస్టారెంట్ లుక్ వస్తుంది. అంతే... ఎంతో రుచికరమైన బనానా లస్సీ రెడీ.