తమ ప్రాంతంలోని క్లిష్టతరమైన అంశాల పరిష్కారం దిశగా భవిష్యత్తులో పాక్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని చైనా కేంద్ర సైనిక కమిషన్ వైస్ ఛైర్మన్ ఝాంగ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. పాక్-చైనా బంధం విడగొట్టలేనిదని అన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారినా తమ దేశం మాత్రం చైనా వెన్నంటే ఉంటుందని బజ్వా ఉద్ఘాటించారు.
భారత్ విషయంలో చైనా, పాకిస్థాన్ కుయుక్తులు మరోసారి బయటపడ్డాయి. ఇరు దేశాలూ భారత్‌ను దెబ్బతీయడానికి చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో దాయాది, పొరుగు దేశం మధ్య సైనిక బంధం మరింత బలోపేతమైంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా నేతృత్వంలో పాక్ త్రివిధ దళాల ప్రతినిధి బృందం.. చైనాలో నాలుగు రోజుల పాటు పర్యటించింది. పాకిస్థాన్ చైనా జాయింట్ మిలటరీ కో-ఆపరేషన్ కమిటీ సమావేశంలో భాగంగా జూన్ 9 నుంచి 12 వరకు సాగిన ఈ పర్యటనలో సైనిక, ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి చర్చలు జరిపింది. ఆదివారం చైనా కేంద్ర సైనిక కమిషన్ వైస్ ఛైర్మన్ ఝాంగ్ యౌక్సికాతో బజ్వా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా చైనా, పాక్ మధ్య సైనిక బంధాన్ని బలోపేతం చేయడంపై ఇరువురూ చర్చించారు. భారత్ పేరు ప్రస్తావించకున్నా ఇది సవాళ్లతో కూడిన సమయం అని పేర్కొంటూ భద్రత సహా ఉగ్రవాద నిరోధక సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు దేశాల త్రివిధ దళాల స్థాయిలో శిక్షణ, సాంకేతిక సహకారాన్ని మరింత పెంచాలని తీర్మానించారు. వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం, పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కొనసాగించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఇదిలావుంటే ఇటీవల ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయగా, దీనికి పోటీగా జే-10 యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు చైనా అందజేసింది. డ్రాగన్, దాయాది ముందు నుంచి భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తుండగా, ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య సైనిక బంధం బలపడడం కలకలం రేపుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ పేరుతో భారత్ భూభాగంలోకి డ్రాగన్ చొచ్చుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గత రెండేళ్లుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల సైనికుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. పలు దఫాలుగా చర్చలు జరిపినా చైనా తన వక్ర బుద్ధిని మాత్రం వదిలిపెట్టడం లేదు. మాట ఇచ్చినట్టే ఇచ్చి చర్చలు ముగిసిన కొద్ది గంటలకే యూటర్న్ తీసుకుంటోంది.