ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ అంతా కలుషితమయం...ఓవైపు రష్యాదాడులు...మరోవైపు దుర్గంధం

international |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 02:14 AM

ఉక్రెయిన్ ప్రజలకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదు అన్నట్లుగా అక్కడి పరిస్థితులు  తయారయ్యాయి. తాజాగా ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో చాలా నగరాల్లో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి దుర్గంధం వెలువడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే.. మరియూపోల్‌ సహా ఇతర ప్రాంతాలనూ ఈ మహమ్మారి చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. మరియూపోల్ గవర్నర్ వాడిమ్ బోయిచెంకో జాతీయ టెలివిజన్‌తో మాట్లాడుతూ.. విరేచనాలు, వాంతులతో కలరా వ్యాప్తి చెందుతోందని అన్నారు.


‘‘20,000 మందిని బలితీసుకున్న తీసుకున్న యుద్ధం దురదృష్టవశాత్తు కలరా వ్యాప్తికి దారితీసి మరియూపోల్‌లోని వేలాది మంది బాధితులయ్యే ప్రమాదం ఉంది.. కుళ్లిపోయిన శవాల ద్వారా కొన్ని బావులు కలుషితమయ్యాయి. ఈ ఉపద్రవం నుంచి బయటపడేలా నగరంలోని ప్రజలను బయటకు వెళ్లేలా మానవతా కారిడార్‌ను ఏర్పాటుచేయాలని ఐక్యరాజ్యసమితి, రెడ్‌క్రాస్‌లకు పిలుపునిచ్చారు.


రష్యా దాడులతో దాదాపు నెలలుగా ఉక్రెయిన్‌ అల్లాడిపోతోంది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోని పలుచోట్ల భీకర యుద్ధం కొనసాగుతోంది. క్రెమ్లిన్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కీవ్‌కు మరో కొత్త సమస్య వచ్చి పడింది. యుద్ధం కారణంగా భవనాలు ధ్వంసం కావడంతో చెత్త పేరుకుపోయి, కుళ్లిన శవాలు, కలుషిత నీరు చుట్టూ ముసురుతున్న కీటకాలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మాస్కో సేనల దాడులో అట్టుడుకిపోయిన మరియూపోల్‌, ఖెర్సోన్‌ వంటి నగరాల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనబడుతున్నాయి. దీంతో దుర్గంధభరిత వాతావరణం నెలకుని ‘కలరా వ్యాధి’కి దారితీస్తోంది.


ఇప్పటికే పలువురు కలరా బారినపడినట్టు మరియూపోల్‌ గవర్నర్‌ ధ్రువీకరించారు. రష్యా ఈ నగరాన్ని మే నెలలో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కుళ్లుతున్న శవాల చుట్టూ ముసురుతున్న ఈగలు, దోమల వంటి కీటకాలతో కలరా వ్యాప్తికి అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రరూపం దాల్చి రోజుల వ్యవధిలో వేల మందిని పొట్టనబెట్టుకునే ప్రమాదం పొంచి ఉందని కలవరపడుతున్నారు. ఇప్పటికే రష్యా దాడులతో తమవాళ్లను పోగొట్టుకుని నిరాశ్రయులుగా మారిన అనేక మందికి కలరా రూపంలో మరో ముప్పు పొంచి ఉండడం పట్ల ఐక్యరాజ్యసమితి సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.


గత నెల రోజులుగా పలు కలరా కేసుల్ని గుర్తించినట్లు మరియూపోల్‌ గవర్నర్‌ తెలిపారు. మరిన్ని అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రష్యా నియమించిన గవర్నర్‌ వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఒక్క కలరా కేసు కూడా వెలుగులోకి రాలేదని తెలిపారు. అయితే, రష్యా గుప్పిట్లో ఉన్న ఈ నగరం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఉక్రెయిన్‌ ఆరోగ్య శాఖ తెలిపింది


రష్యా దాడుల్లో ఏప్రిల్‌ నాటికే మరియుపోల్‌లో 10 వేల మంది మరణించినట్లు అంచనా. ఆ తర్వాత కూడా కొన్ని వారాల పాటు యుద్ధం కొనసాగిన నేపథ్యంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఉక్రెయిన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ నగరంలో తాగునీటిలో మురుగునీరు చేరుతోందని.. ఇది కలరా సహా ఇతర అంటువ్యాధులకు దారితీసే అవకాశం ఉందని ఇటీవల ఐరాస, రెడ్‌క్రాస్‌ హెచ్చరించాయి. అలాగే, ఔషధాల కొరత వేధించిన నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.


తమ నగరంలో వైద్యులు కూడా అందుబాటులో లేరని స్థానికులు వాపోతున్నారు. 80 ఏళ్లు పైబడిన రిటైర్డ్‌ డాక్టర్లను రష్యా అధికారులు నియమిస్తున్నారని పేర్కొన్నారు. కలరా చాలా తీవ్రమైన అంటువ్యాధి. సకాలంలో చికిత్స అందకపోతే మహమ్మారి గంటల్లోనే మరణానికి దారితీస్తుంది. ‘విబ్రియో కలరా’ అనే బాక్టీరియా కారణం కాగా.. కలుషిత ఆహారం, నీరు వ్యాధి సంక్రమిస్తుంది. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీటిలో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి తీవ్ర మానవతా సంక్షోభాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com