నాటు తుపాకీ పేలిన ఘటనలో ఓ గిరిజన బాలుడు తీవ్ర గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పాచిపెంట మండలం గిరిశిఖర గ్రామం తుమరావిల్లిలో గిరిజనులు వినియోగించే నాటు తుపాకీతో ఆదివారం పిల్లలు ఆడుకున్నారు. ఆ తుపాకీలో గోళీకాయ ఉందన్న విషయం వారి గ్రహించలేదు. ఓ బాలుడి చేతిలో ఉండగా తుపాకీ ఆకస్మికంగా పేలింది. ఈ ఘటనలో డమ్మి అజిత్ కుమార్ అనే పదేళ్ల బాలునికి కంటిపై గోళీ తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన అజిత్‌కుమార్‌ను తొలుత విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బాలుడి తండ్రి డమ్మి సింహాచలం ఫిర్యాదు మేరకు సాలూరు సీఐ లెంక అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.