ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందంటే ఇదేనేయో

international |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 01:54 AM

ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందట అన్న సామెత్త మనం ఎన్నోసార్లు వినివుంటా. ఈ సామెత వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా సమాజంలోని ఘటనలు ఇది సరైందేనని రుజువు చేస్తుంటాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోన్న పాకిస్థాన్‌కు యూరప్ దేశాల కారణంగా మరో షాక్ తగిలింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో... మాస్కో నుంచి ఇంధనం కొనుగోళ్లను నిలిపేయాలని యూరోపియన్ దేశాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. అయితే పాకిస్థాన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని అనుకుంటున్నారా..? లిక్విడ్ నేచురల్ గ్యాస్ కోసం దశాబ్దం క్రితమే పాకిస్థాన్ ఇటలీ, ఖతార్ దేశాల్లోని గ్యాస్ సప్లయర్లతో చౌక ధరకే గ్యాస్ విక్రయించేలా దీర్ఘకాలిక ఒప్పందాలుకుదుర్చుకుంది. కానీ ఇప్పుడు యూరోప్ దేశాల నుంచి భారీగా డిమాండ్ ఉంటుండటంతో... ఇటలీ, ఖతార్ దేశాలకు చెందిన గ్యాస్ సప్లయర్లు పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ.. ఆ గ్యాస్‌ను యూరోపియన్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.


ఇటీవలి వరకూ యూరప్‌కు రష్యా అతిపెద్ద గ్యాస్ సరఫరాదారుగా ఉంది. కానీ ఉక్రెయిన్‌పై మాస్కో దాడుల నేపథ్యంలో ఆ దేశం నుంచి గ్యాస్ కొనుగోలు చేయడానికి విముఖంగా ఉన్న యూరప్ దేశాలు ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నాయి. గత ఏడాదితో ఇదే కాలంతో పోలిస్తే.. ఈ సంవత్సరం యూరప్ గ్యాస్ దిగుమతులు 50 శాతం పెరిగాయి. యూరప్ దేశాల నుంచి డిమాండ్ పెరగడం.. వాటికి గ్యాస్ విక్రయం వల్ల మంచి లాభాలు వస్తుండటంతో.. గ్యాస్ సరఫరా సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతుల్ని తగ్గిస్తున్నాయి.


వాస్తవానికి గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే.. వంద శాతం వరకు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. దీంతో గ్యాస్ సరఫరా సంస్థలు ఒప్పందాన్ని ఉల్లంఘించవు. ధర ఎక్కువైనా సరే.. స్పాట్ మార్కెట్లో కొనుగోలు చేసి ఎగుమతి చేస్తుంటాయి. కానీ యూరోపియన్ దేశాలకు స్పాట్ మార్కెట్లో విక్రయించడం ద్వారా వచ్చే లాభాలతో పోలిస్తే పాకిస్థాన్‌కు చెల్లించాల్సిన పెనాల్టీ తక్కువగా ఉండటంతో... గ్యాస్ సరఫరా సంస్థలు పాకిస్థాన్‌ను లైట్ తీసుకుంటున్నాయి. ఫలితంగా మండు వేసవిలో పాకిస్థాన్‌లో కరెంట్ కోతలు పెరిగిపోతున్నాయి. దీంతో పాకిస్థాన్ గ్యాస్ అవసరాల కోసం రష్యాతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంది.


ఫలితంగా పవర్ ప్లాంట్లకు సరిపడా గ్యాస్ లేకపోవడంతో.. పాకిస్థాన్ ప్రజలు చీకట్లలో మగ్గాల్సిన పరిస్థితి తలెత్తింది. రంజాన్ పండుగ సమయంలో కరెంట్ కోతలను తప్పించడం కోసం సింగిల్ గ్యాస్ షిప్‌మెంట్‌ను స్పాట్ మార్కెట్లో కొనుగోలు చేయడానికి పాకిస్థాన్ 100 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. అసలే ఆర్థికవ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్‌కు ఇది చాలా పెద్ద మొత్తం.


పాకిస్థాన్‌లో జులైతో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ దేశం లిక్విడ్ గ్యాస్ కోసం 5 బిలియన్ డాలర్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చర్చలు జరుపుతోంది. దీంతో ఇంధనం, విద్యుత్‌పై ప్రజలకు సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో పాకిస్థాన్ ప్రభుత్వం లేదు.


గ్యాస్ సప్లయర్స్ యూరోప్ వైపు చూస్తుండటంతో.. పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో 12 గంటలకుపైగా కరెంట్ కోతలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 13.8 శాతానికి చేరడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారిని మరింత రెచ్చగొట్టేలా ఇమ్రాన్ ఖాన్ తరచుగా భారీ ర్యాలీలు, నిరసనలకు పిలుపునిస్తున్నారు.


విదేశాల నుంచి స్పాట్ మార్కెట్లో గ్యాస్ కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో.. ఇప్పటికే ఉన్న గ్యాస్ నిల్వలను పవర్ ప్లాంట్లకు మళ్లిస్తున్నారు. దీంతో ఎరువుల తయారీ కంపెనీలకు గ్యాస్ కొరత తలెత్తనుంది. ఫలితంగా వచ్చే సీజన్లో వ్యవసాయంపై దాని ప్రభావం పడి.. ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. కరెంట్ కోతల సమయంలో సెల్ ఫోన్ టవర్లు బ్యాకప్ జనరేట్లను ఉపయోగిస్తున్నాయి. కానీ వాటి దగ్గర కూడా ఇంధనం నిండుకుంటోంది. గత రెండేళ్లలో లిక్విడ్ నేచురల్ గ్యాస్ ధర 1000 శాతానికిపైగా పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa