ఎయిడ్స్ వచ్చిందంటే దానికి పరిష్కారం చావు తప్ప మరోటి కాదు అనే పరిస్థితి నేటీ వరకు కూడా ఉంది. ఈ ఎయిడ్స్ ను సమూలంగా అంతం చేసే యత్నంలో ఇజ్రాయేల్ విజయం సాధించింది. దశాబ్దాల తరబడి మానవాళిని పీడిస్తున్న హెచ్‌ఐవీ ని సమూలంగా అంతం చేసే సరికొత్త ఔషధాన్ని ఇజ్రాయేల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎయిడ్స్ కు కారణమయ్యే వైరస్‌ను జన్యుమార్పిడి రూపంలో తాము అభివృద్ధిచేసిన ఔషధం నాశనం చేస్తోందని టెల్ అవీవ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇంజెక్షన్ రూపంలో ఒక్కడోసు ఇవ్వగానే హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకుని, ఎయిడ్స్ నుంచి బాధితులకు విముక్తి కలిగించే అవకాశముందని నిర్ధారణకు వచ్చారు. ఎయిడ్స్ పరిశోధనల్లో దీన్ని గొప్ప ముందడుగుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. పరిశోధన వివరాలను ప్రముఖ సైన్స్ జర్నల్ ‘నేచుర్’లో ప్రచురించారు.
టెల్ అవీవ్ యూనివర్సిటీలో ది జార్జ్ ఎస్ వైస్ ఫ్యాకల్టీ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేపట్టింది. సాధారణంగా ఎముక మజ్జలో తయారయ్యే బి-కణాలుగా పేర్కొనే తెల్ల రక్తకణాలు పరిపక్వం చెంది తర్వాత రక్తం, గ్రంథుల వ్యవస్థల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి శరీరంలోని వివిధ అవయవాలకు చేరుకుంటాయి. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థను ఈ కణాలే ప్రేరేపిస్తాయి. అయితే, హెచ్‌ఐవీ తదితర వైరస్‌లు బి-కణాలపై ప్రభావం చూపి, విచ్ఛిన్నమయ్యేలా ప్రోత్సహిస్తాయి.
ప్రస్తుతం ఇజ్రాయేల్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా వైరస్‌లోని కొన్ని భాగాలను ఉపయోగించి తెల్లరక్త కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. జన్యుమార్పిడిగి గురైన ఈ కణాలు.. వైరస్ ప్రవర్తనను పసిగట్టి, తదనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకుంటాయి. తద్వారా హెచ్‌ఐవీని నిరోధించే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. వైరస్‌ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాయి.
పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ బార్జెల్ మాట్లాడూతే.. ‘‘సీఆర్‌ఐఎస్‌పీఆర్ అనే సాంకేతికత సహాయంతో టైప్-బి తెల్లరక్త కణాల జన్యువుల్లో మార్పులు చేశాం.. తర్వాత వీటిని ప్రయోగశాలలో పరీక్షించగా... వైరస్‌ను సమర్థంగా అడ్డుకునేలా రక్తంలో భారీగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి.. ఈ ప్రతినిరోధకాలు హెచ్‌ఐవీని అత్యంత సమర్థంగా అడ్డుకోగలవన్న నిర్ధారణకు వచ్చాం’’ అని తెలిపారు. తాము రూపొందించిన వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు అత్యంత సురక్షితమైనవి, సమర్థంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
కేవలం హెచ్‌ఐవీ-ఎయిడ్స్ నివారణకే కాకుండా... కేన్సర్, రోగనిరోధక వ్యవస్థ స్వీయదాడి చేసుకునే ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సలోనూ ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిశోధనలో ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. జన్యు మార్పిడి చేసిన తెల్లరక్త కణాలతో ఎయిడ్స్‌ను నిరోధించే ఔషధాన్ని రూపొందించి, మరింత లోతైన పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తిచేసుకుని, ఔషధాన్ని అందుబాటులో తీసుకురావడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.
హెచ్ఐవీని మొదటిసారిగా మధ్య ఆఫ్రికాలోని చింపాంజీల్లో గుర్తించారు. దాని నుంచి 1800 సంవత్సరంలో మానవులకు వ్యాపించినట్టు నమ్ముతున్నారు. 90వ దశకంలోనే ఎయిడ్స్‌ను దక్షిణాఫ్రికాలో గుర్తించారు. హెచ్ఐవీ బాధితులతో అరక్షిత శృంగారం, వారి వాడిన సూదులను పంచుకోవడం వల్ల ఈ వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa