అగ్నిపథ్ స్కీంపై జరుగుతున్న ఆందోళనలు కేంద్రప్రభుత్వం సృష్టించినవేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళనపై ఆయన స్పందిస్తూ, నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్నారని, దాని ఫలితమే ఈ హింసాకాండ అని ఆరోపించారు. సైనిక రిక్రూట్మెంట్ విధానాన్ని ఎందుకు అర్థాంతరంగా మార్చారని ప్రశ్నించారు. 15 నెలల్లోనే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనలోనే దగా ఉందన్నారు. నిరుద్యోగులను మాయ చేసే దుర్మార్గపు ఆలోచనలతోనే ఈ అగ్నిపథన్ను తీసుకొస్తున్నారని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పునః సమీక్షించి పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండు చేశారు.