ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండే వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంటల సాగు కొరకు సేద్యపు పనుల్లో బిజీ అవుతున్నారు. రెండు నెలలుగా మండిన ఎండలకు ప్రజలు మలమలమాడిపోయారు. నిప్పుల కుంపటిలా మారిన వాతావరణంతో చల్లదనం కోసం పరితపించిపోయారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా చల్లని ఈదురు గాలులతో మారిన వాతావరణంతో ప్రజలు సేదతీరారు. కురిసిన వర్షంతో ప్రజలకు ఉపశమనం లభించినట్లుయింది. ఖరీఫ్ పనులు ప్రారంభించేందుకు రైతులు సన్నద్ధముతున్నారు. వాతావరణం చల్లబడటంతో ఖరీఫ్ పనులు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే రబీ పనులు పూర్తవ్వడంతో రైతులు ఖరీఫ్ పనులకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం జూన్ 1 తేదీ నుంచే వేరుశనగ రాయితీ విత్తనాలను పంపిణీ చేసింది. వేరుశనగ సాగుకు విత్తనాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురిస్తే వేరుశనగ దిగుబడి సాధించవచ్చునని రైతులు ఆశాభావంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు.