రాజకీయ పార్టీకి ప్లీనరీ ఎందుకంటే.. "పాలనలో భాగంగా లక్ష్యాలను చేరుకున్నామా లేదా అందుకు అనుగుణంగా పార్టీని నడిపామా ? నడపలేకపోతే అందుకు ఏయే అంశాలు దోహదపడ్డాయి. మరింత సమర్థ నీయ ధోరణిలో ఏ విధంగా పనిచేయాలి..? అన్నవి.. పార్టీలో పనిచేసేవారందరికీ ఓ అవగాహన కల్పించడమే అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఈ సమాజాన్ని మెరుగైన సమాజంగా రూపొందించేందుకు పనిచేసేదే రాజకీయ పార్టీ..ఇందులోభాగంగా అందరి క్షేమం కోరుకునే విధంగా పనిచేయాలి అంటే ఏం చేయాలి..? అన్న విషయమై అధ్యయనం చేశాం..అవినీతి లేని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓ వంతు..అందుకు తగ్గ వ్యవస్థను రూపొందించి అమలు చేయడం..మరో వంతు. అదే రీతిన గౌరవంగా అర్హత ఉన్న వారందరికీ సంక్షేమం అందేలా చేయడం.. బాధ్యత. సంక్షేమం అందుకోవడం అన్నది రాజ్యాంగం అందించిన గౌరవం అని భావించే విధంగా చేయడం..ఓ అధికార పార్టీ విధి. వీటన్నింటిపై విధానపర నిర్ణయాలు వెలువరించడం..అమలు చేయడం అన్నది ఇవాళ వైయస్ఆర్‌సీపీ పాటిస్తున్న ప్రథమ కర్తవ్యం.." అని తెలియజేసారు.