కడప నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్. పి అన్బురాజన్ తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్. పి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజల సౌకర్యార్ధం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనువైన స్థలాలను గుర్తించి పార్కింగ్ కు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్. పి తెలిపారు. తరచూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగి వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే రద్దీ ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సాఫీగా వెళ్లేలా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఎస్. పి పేర్కొన్నారు.
షాపింగ్ ప్రాంతాల్లో రద్దీ లేకుండా సాఫీగా వెళ్లేందుకు తీసుకున్న చర్యలతో చిల్లర దొంగతనాలు, జేబు, బ్యాగ్ దొంగతనాలు బాగా తగ్గే అవకాశం ఉందన్నారు. నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలలో సి. సి కెమెరాల నిఘా ఉంటుందని, తద్వారా వాహనాల చోరీ జరగకుండా సురక్షితంగా ఉంటుందన్నారు. తమ వాహనాల భద్రతను, ట్రాఫిక్ కు ఆటంకం కలగకుండా పోలీస్ శాఖ నిర్దేశించిన స్థలాల్లో కాకుండా ప్రజలు ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ చేయవద్దని జిల్లా ఎస్. పి సూచించారు. షాపుల యజమానులు కూడా వినియోగదారులను నిర్దేశించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసేలా చూడాలన్నారు.