హైదరాబాద్ లో ఏపీ రాష్ట్ర రాజకీయాల వ్యవహారంలో కాకరేపుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటి దగ్గర కానిస్టేబుల్‌పై దాడి వ్యవహారం కలకలంరేపింది. ప్రధాని మోదీ ఏపీ, తెలంగాణ పర్యటన సందర్భంగా ఎస్పీజీ మార్గదర్శకాల ప్రకారం రెండు రాష్ట్రాల పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటనలో కొందరు ఆందోళనలకు దిగుతున్నారని సమాచారం వచ్చింది. అందుకే ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన సంఘాల ప్రతినిధులు, ఆందోళనకారులు, అనుమానితుల కదలికలను గుర్తించేందుకు.. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కొందరు కానిస్టేబుళ్లను హైదరాబాద్‌లో స్పాటర్స్‌గా పంపించింది.
ఈ క్రమంలో అనంతపురానికి చెందిన కానిస్టేబుల్ ఫరూక్ బాషాను హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ గేటు దగ్గర స్పాటర్‌గా నియమించారు. ఫరూక్ సోమవారం ఉదయం ఐఎస్‌బీ గేటు వద్ద విధుల్లో ఉన్నారు. ఇదే క్రమంలో గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో ఉన్న ఎంపీ రఘురామ నివాసానికి ఐఎస్‌బీ దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంది. ఇంతలో రఘురామ కుటుంబ సభ్యులు కొందరు, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లతో కలసి వచ్చి ఫరూక్‌పై దాడి చేశారు. అక్కడే నడిరోడ్డుపైనే పిడిగుద్దులు కురిపించారు. అతడు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను అని గుర్తింపు కార్డు చూపిస్తున్నా పట్టించుకోలేదు. అతడి దగ్గర ఐడీ కార్డు లాక్కున్నారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా చేతులు వెనక్కి కట్టి, దాడి చేస్తూ ఈడ్చుకుని ఎంపీ ఇంటికి తీసుకెళ్లారు.
ఈ దాడి ఘటనను కొంతమంది వాహనదారులు, అక్కడే ఉన్నవాళ్లు మొబైల్స్‌లో వీడియో తీశారు. కొద్దిసేపటి తర్వాత అతడ్ని అనుమానాస్పద వ్యక్తిగా భావించి పట్టుకున్నామని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. తాను విధి నిర్వహణలో ఉంటే ఎంపీ కుటుంబసభ్యులు, సిబ్బంది, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు దాడి చేసి గాయపరిచారని కానిస్టేబుల్ ఫరూక్ బాషా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫరూక్ విధులకు రఘురామకృష్ణరాజు ఇంటితో, ఆ ప్రాంతంతోగానీ సంబంధమే లేకపోయినా దాడి చేసినట్లు చెబుతున్నారు.