ఓ అంధబాలుడు ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తితో తిలకించారు. దృష్టి లోపం ఉన్న వారి సాధారణ జీవితాన్ని సులభతరం చేసేందుకు రూపొందించిన ఓ ఉత్పత్తికి దృష్టి లోపంతో బాధపడుతున్న చిన్నారి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. థింకర్ బెల్ ల్యాబ్స్ అనే సంస్థ ‘ఏనీ’అనే ఉత్పత్తిని రూపొందించింది. బ్రెయిలీ భాష నేర్చుకోవడాన్ని ‘ఏనీ’ సులభతరం చేస్తుందని థింకర్ బెల్ ల్యాబ్స్ చెబుతోంది. డిజిటల్ ఇండియా వీక్ సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి 11 ఏళ్ల ప్రథమేష్ సిన్హా ‘ఏనీ’అనే ఉత్పత్తి గురించి ప్రత్యక్షంగా వివరించాడు. దీన్ని ప్రధాని ఆసక్తిగా విని అతడి తలను నిమిరారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చావంటూ ప్రశ్నించారు. ఇదిలావుంటే తన బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రథమేష్ సిన్హా 'ఏనీ' గురించి ప్రధానికి వివరిస్తున్న వీడియోను థింకర్ బెల్ ల్యాబ్స్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. తమ ఉత్పత్తి గురించి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రథమేష్ సిన్హా వివరించడం గర్వకారణమని పేర్కొంది.