రాష్ట్రంలో కార్మికుల మేలుకోరే ప్రభుత్వం ఉందని, ప్రజా సేవలకు విఘాతం కలిగించి మునిసిపల్ ఒప్పంద పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడం భావ్యం కాదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అంశంపై పట్టుబట్టి సమ్మె చేయడం సరికాదని మునిసిపల్ ఒప్పంద కార్మికులకు హితవు పలికారు. ధర్నాలు, సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావని, కలిసి చర్చించుకుంటే పరిష్కారమవుతాయన్నారు.
పక్క రాష్ట్రంతో పోలిస్తే పారిశుధ్య ఒప్పంద కార్మికులకు ఏపీలో మెరుగైన వేతనాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సీఎం వైఎస్ జగన్ కార్మికులకు న్యాయం చేస్తారన్నారు. ప్రస్తుతం కార్మికుల్లో ఏ ఒక్కరికీ రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇస్తున్నట్టు చెప్పారు. కార్మికులకు కావల్సిన అన్ని సౌకర్యాలు, పనిముట్లు కూడా సరిపడినన్ని అందుబాటులో ఉంచామన్నారు. దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పంద కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి రావాలని సూచించారు.