ఎగువ ప్రాంతాల్లో ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరెస్టు కాదని, ఎగువ ప్రాంతాల్లో ఎప్పుడూ వచ్చే వరదలే ఇప్పుడు వచ్చాయని పుదుచ్చేరి ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై చెప్పారు. యానాంలోని వరద ముంపు ప్రాంతాల నకు మంగళవారం వచ్చిన ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. వరదలకు సంబంధించి ఈనెల 15న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. వరద ముంపు బాధితులకు పుదుచ్చేరి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటికే ప్రభుత్వం తక్షణ సహాయం ప్రకటించిన విషయం తెలిసిందేనన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు, 25 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించనున్నట్లు చెప్పారు. సమీప ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా యానానికి రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే కేంద్రం రూ. 137 కోట్లు మంజూరు చేసిందని, దీనిని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం వచ్చిన వరదలకు తీసుకోవాల్సిన చర్యలు, రానున్న రోజుల్లో వచ్చే వరదలకు చేపటాల్సిన చర్యలపై ప్రభుత్వం సమీక్షించనుందన్నారు. వరద తగ్గిన అనంతరం నష్టం పై ఇచ్చే నివేదిక ఆధారంగా బాధితులను ఆదుకుంటామన్నారు. సమావేశంలో ప్రజా పనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి శాయి శార్వణన్, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, కలెక్టర్ వల్లవన్, ఆర్ఎ ఆమన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.