ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంపై 13,745 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2017-18 నుంచి ప్రారంభించిన ఈ పెట్టుబడులు 2022-23 వరకు కొనసాగుతాయి. గడచిన అయిదేళ్ళ కాలంలో రాష్ట్రంలో చేపట్టిన అనేక పునరుత్పాదక ఇంధన స్కీములు, కార్యక్రమాల అమలు కోసం కేంద్ర సాయం కింద 454 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్రమంత్రి చెప్పారు. దేశంలో పవర్ గ్రిడ్‌తో అనుసంధానమైన సౌర, పవన విద్యుత్ ప్రాజెక్ట్‌లలో అత్యధికం ప్రైవేట్ డెవలపర్స్ అభివృద్ధి చేసినవేనని తెలిపారు.