పేదలపై భారం పడేలా పన్నుల విధింపు క్రూరత్వమేనని కేంద్ర ప్రభుత్వ తీరును కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ జై రాం రామేష్ తీవ్రంగా విమర్శించారు. ప్యాక్ చేసిన ఆహార ధాన్యాలను జీఎస్టీ పరిధిలోకి తేవడాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి తీవ్రంగా తప్పుపట్టింది. జీఎస్టీ విధింపును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ‘‘ఎంతో కొంత శుభ్ర పరిచి ప్యాక్ చేసిన ఆహార ధాన్యాలను పేదలు, మధ్య తరగతి వారు కొనుక్కోవద్దా? పేదలకు కాస్త మంచి ఆహారం అందకుండా దూరం చేయాలా? ఇప్పటికే దేశంలో నిత్యావసరాల ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి ఉన్నాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది. రూపాయి విలువ పడిపోతోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పేదలపై భారం పడేలా పన్నుల విధింపు క్రూరత్వమే..” అని జైరాం రమేశ్ మండిపడ్డారు.
పెద్ద పెద్ద కంపెనీలు వివిధ బ్రాండ్ల పేరిట విక్రయించే ఆహార ధాన్యాలు, ఉత్పత్తులపై పన్ను విధించడం వేరు అని.. ముందుగా ప్యాక్ చేసి, ధరను ముద్రించి విక్రయించడం వేరు అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. పెద్ద కంపెనీల బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలు అధికంగా ఉంటాయని.. కానీ స్థానికంగా చిన్న సంస్థలు, దుకాణాలు ముందుగా ప్యాక్ చేసి అమ్మే వాటి ధరలు తక్కువగా ఉంటాయని.. వీటిని పేదలు, మధ్య తరగతి వారు కొనుగోలు చేస్తారని వివరించారు. విడిగా అమ్మే సరుకుల కంటే.. ప్యాక్ చేసి పెట్టినవి కాస్త నాణ్యంగా, శుభ్రపర్చి ఉంటాయని.. ఇప్పుడు పన్ను విధింపు వల్ల పేదలపై భారం పడుతుందని పేర్కొన్నారు.