గత 2019 ఎన్నికల తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో శివసేన జట్టు కట్టడం అనేది బాల్ థాక్రే ఆలోచనలకు ద్రోహం చేయడమేనని మాజీ మంత్రి రాందాస్ కదమ్ ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే కారణంతో మాజీ మంత్రి రాందాస్ కదమ్, మాజీ ఎంపీ ఆనందరావు అద్సుల్ సహా పలువురు నేతలను శివసేన నుంచి ఉద్ధవ్ థాక్రే బహిష్కరించారు. దీంతో రాందాస్ కదమ్, ఆనందరావు.. ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరిపోయారు. అనంతరం రాందాస్ కదమ్.. శివసేన అధినేత, ఆయన కుమారుడిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎంగా ఉన్న సమయంలో ఉద్ధవ్ ఎప్పుడూ ‘బిజీ’గా ఉండేవారని.. తనను అవమానించారని ఆయన ఆరోపించారు. 2019 ఎన్నికల తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో శివసేన జట్టు కట్టడం అనేది బాల్ థాక్రే ఆలోచనలకు ద్రోహం చేయడమేనని రాందాస్ ఆరోపించారు.
ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్యపై కదమ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేల గురించి మాట్లాడే ముందు తన వయసు గుర్తుంచుకొని మాట్లాడాలని ఆయన సూచించారు. 2014 నుంచి 2019 వరకు పర్యావరణ మంత్రిగా వ్యవహరించిన కదమ్.. 2018లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం విధించారు. అయితే ఆ క్రెడిట్ ఆదిత్య థాక్రే ఖాతాలోకి వెళ్లింది.
‘నేను పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆదిత్య థాక్రే మినిస్టర్ క్యాబిన్‌లో ఏడాదిన్నరపాటు నాతో కూర్చున్నారు. అప్పట్లో ఆదిత్య నన్ను అంకుల్ అని పిలిచేవాడు. అలాంటి ఆదిత్య నా మంత్రి పదవిని లాగేసుకుంటాడని ఊహించలేకపోయాను. నా జీవితంలో ఇలాంటి రాజకీయాల్ని నేనెప్పుడూ చేయలేదు. బయటి వ్యక్తి వచ్చి మినిస్టర్ క్యాబిన్‌లో కూర్చోవడం, ఇలా మీటింగ్‌లు పెట్టడం అనేది జరగదు. కానీ ఆదిత్యనాథ్ థాక్రే ఉద్దవ్ థాక్రే కుమారుడు కావడం వల్లే నేనేం చెప్పలేకపోయాను.
పర్యావరణ శాఖ మంత్రిగా ప్లాస్టిక్ బ్యాన్ నిషేధాన్ని నేను తీసుకున్నాను. కానీ క్రెడిట్ మాత్రం ఆదిత్యనాథ్ థాక్రేకు ఇచ్చారు. అప్పుడు కూడా నేనేమీ మాట్లాడలేదు’ అని కదమ్ తెలిపారు. టీవీ ఇంటర్వ్యూల్లో విలపిస్తూ కనిపించిన రాందాస్ కదమ్.. ఎంత మంది నాయకుల్ని శివసేన నుంచి బహిష్కరిస్తారని ప్రశ్నించారు. 50 మంది ఎమ్మెల్యేలు, 12 ఎంపీలు సీఎం ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ఎందుకు ప్రకటించారనే విషయమై ఉద్దవ్ ఆత్మపరిశీలన చేసుకోవాలని కదమ్ సూచించారు.
శివసేన రెబల్ ఎమ్మెల్యేలు గువహటిలో ఉన్నప్పుడు తాను షిండేతో మాట్లాడానని.. తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ఆయన అంగీకరించారని.. కానీ థాక్రే చుట్టూ ఉన్న కోటరీ అందుకు అంగీకరించకుండా ఎమ్మెల్యేలను దూషించడం మొదలుపెట్టిందని కదమ్ ఆరోపించారు. శివసేనను చీల్చడంలో ఎన్సీపీ అధినేత శరద్ పవర్ చివరకు విజయం సాధించారని ఆయన ఆరోపించారు.
రత్నగిరి జిల్లాకు చెందిన కదమ్.. 1990లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయన మరో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2005 నుంచి 2009 వరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కదమ్ వ్యవహరించారు. 2010లో తొలిసారి ఎమ్మెల్సీ అయిన ఆయన.. 2015లో మరోసారి మండలికి ఎన్నికయ్యారు.