భక్తులకు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాలు ఏకంగా గర్బగుడిలోనే కొట్టుకొన్నారు. దర్శనం విషయంలో గొడవ ముదరడంతో ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయ గర్భగుడిలో భక్తులు, ఆలయ సిబ్బంది పరస్పరం దాడిచేసుకుని కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించి సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫుటేజీలో నలుగురు ఆలయ సేవకులు, ఇద్దరు భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ కనిపించారు.
నిన్న సాయంత్రం ఆలయ గర్భగుడి వద్ద హారతి ఇస్తున్న సమయంలో తలుపులు మూసేసినా దర్శనం కోసం ఇద్దరు భక్తులు పట్టుబట్టారు. వారిని ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వివాదం మొదలైంది. ఆ తర్వాత అది మరింత ముదరడంతో భక్తులు, ఆలయ సిబ్బంది కొట్టుకున్నారు. గర్భగుడి నుంచి భక్తులను బయటకు పంపిన తర్వాత ఆలయ సిబ్బంది నిర్వాహకులకు లేఖ రాశారు. తమకు పోలీసులు సహకరించలేదని అందులో ఆరోపించారు. మరోవైపు, ఇద్దరు భక్తులు నలుగురు ఆలయ సిబ్బంది సహా ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. దర్శనం విషయంలో పోలీసులు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన తర్వాత ఆలయ సిబ్బంది ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారమైంది.