చాలా వరకు మనకు చట్టాలు, నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల మనం ఎన్నో సౌకర్యాలను కోల్పోతూ ఉంటాం. ఇదిలావుంటే చాలా మంది రైల్వే ప్రయాణాన్ని సిఫార్సు చేస్తారు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. బస్సులో ప్రయాణం చేస్తే కంఫర్ట్ ఉండకపోవచ్చు. అదే ట్రైన్‌లో అయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే చార్జీ కూడా తక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం ప్రయాణం చేసినా తక్కువ ఖర్చు అవుతుంది. అదే బస్సులో అందరూ వెళ్లాలంటే మాత్రం చార్జీలకు ఎక్కువ డబ్బులు కావాలి. అలాగే టాయిలెట్స్ ఉంటాయి. అటు ఇటు తిరగొచ్చు. అందుకే చాలా మంది ట్రైన్‌లో ప్రయాణం చేయడానికే ఇష్టపడతారు. అయితే ట్రైన్‌లో జర్నీ చేసే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని సర్వీసులను ఉచితంగా కూడా పొందొచ్చు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది. క్లాస్ అప్‌గ్రేడేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంపిక చేసుకుంటే.. మీ ట్రైన్ టికెట్ ఆటోమేటిక్‌గానే తర్వాత క్లాస్‌కు అప్‌గ్రేడ్ అవుతుంది. దీనికి ఎలాంటి చార్జీలు ఉండవు. అంటే మీరు స్లీపర్ టికెట్ బుక్ చేసుకుంటే.. సీట్ల లభ్యత ప్రకారం ఏసీ క్లాస్‌కు టికెట్ అప్‌గ్రేడ్ కావొచ్చు. అందుకే క్లాస్ అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
వికల్ప సర్వీసులు కూడా ఉచితంగా పొందొచ్చు. మీరు ఈ ఆప్షన్ ఎంచుకుంటే.. ట్రైన్ టికెట్ కన్ఫార్మ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మీరు ఎంచుకున్న ట్రైన్‌లో టికెట్ వెయిటింగ్‌లోనే ఉండిపోతే.. అప్పుడు మీరు వెళ్లాల్సిన ప్రాంతానికి వెళ్లే మరో ట్రైన్‌లో మీకు సీటు లభిస్తుంది. మీరు ఆ ట్రైన్‌లో మీ గమ్య స్థానానికి చేరొచ్చు. అంటే ట్రైన్ మారుతుంది. ఇక్కడ మీరు ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా మరో ట్రైన్‌లో బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది.
ఇంకా ట్రైన్ టికెట్‌ను మరొకరి పేరు పైకి బదిలీ చేయొచ్చు. అయితే తన కుటుంబంలోని వారి పేరు పైకి మాత్రమే టికెట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు జర్నీ చేయాల్సిన ట్రైన్ బయలు దేరడానికి 24 గంటల ముందుగానే టికెట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దగ్గరిలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవాలి.
అలాగే బోర్డింగ్ స్టేషన్ కూడా మార్చుకోవచ్చు. ట్రైన్ టికెట్‌ను ఎలాగైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చొ.. అలానే రైల్వే బోర్డింగ్ స్టేషన్ కూడా మార్చుకోవడానికి ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్‌ను ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవడం వీలవుతుంది. అంతేకాకుండా ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సర్వీసులు కూడా అందిస్తోంది. దీని కోసం కేవలం 35 పైసలు చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ప్రయాణంలో ఏమైనా ప్రమాదం జరిగి మరణిస్తే రూ.10 లక్షల వరకు బీమా లభిస్తుంది.