రాజకీయాలలోకి ఎంట్రీపై నో అని మరోసారి తన అభిప్రాయం వ్యక్తంచేశారు తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్. ఇదిలావుంటే దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సన్నాహక చర్యగా రజనీ మక్కల్ మండ్రం (ఆర్ఎంఎం) అనే సంస్థను స్థాపించారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసింది. సొంతంగా రాజకీయ పార్టీ పెడతారా? లేక, మరేదైనా పార్టీలో చేరతారా? అనేది చర్చనీయాంశం అయింది. అయితే రజనీ ఆరోగ్య పరిస్థితి వీటన్నింటికీ ముగింపు పలికింది. గత కొంతకాలంగా రజనీకాంత్ తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇక తాను రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించారు. అంతేకాదు, రజనీ మక్కల్ మండ్రం (ఆర్ఎంఎం)ను రద్దు చేసి, దాన్ని అభిమానుల సంక్షేమ సంఘంగా మార్చేందుకు నిర్ణయించారు.
ఇదిలావుంటే చెన్నైలో ఇవాళ రజనీకాంత్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో అరగంట సేపు భేటీ అయ్యారు. దాంతో, మీడియా ప్రతినిధులు రజనీకాంత్ ను రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే ఆలోచన ఏదైనా ఉందా? అని అడిగారు. అయితే ఆయన "నో" అంటూ ఒక్కమాటలో తేల్చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో రాజకీయాల గురించి చర్చించానని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో మాత్రం ఆయనను కలవలేదని స్పష్టం చేశారు. ఆయనతో ఏం చర్చించానన్నది చెప్పలేనని అన్నారు. గవర్నర్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని రజనీ వివరణ ఇచ్చారు.
"గవర్నర్ ఉత్తరాదికి చెందిన వ్యక్తి. ఇప్పుడాయన తమిళనాడుకు వచ్చారు. ఆయనకు తమిళనాడు అంటే చాలా ఇష్టం. తమిళుల నిజాయతీ, కష్టించి పనిచేసే స్వభావాన్ని ఆయన అభిమాని. అంతేకాదు, తమిళుల ఆధ్మాత్మికతను ఆయన ఎంతోగానో ఇష్టపడతారు" అంటూ రజనీకాంత్ వెల్లడించారు.